గోదావరికి పోటెత్తిన వరద: ఏపీలో లంక వాసుల ఇబ్బందులు
భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరితో పోటు వాగులు, వంకలు,చెరువులు కూడ ఉప్పొంగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ ఎర్రకాలువ, జల్లేరుకు వరద పోటెత్తింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పి.గన్నవరం మండలంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు నాటు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గోదావరికి వరద పోటెత్తిన ప్రతి ఏటా తమకు ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు.ధవళేశ్వరం వద్ద గోదావరి 12.30 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం నుండి 10,55, 000 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.మరోవైపు కాకినాడలో అధికారులు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రజలు 1800425367 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
మరో వైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ లను మోహరించినట్టుగా అధికారులు తెలిపారు.12 బోట్లు, 2,500 లీటర్ల డీజీల్, లక్ష వాటర్ బాటిళ్లను వరద ప్రభావిత గ్రామాలకు పంపినట్టుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, పల్నాడు, అల్లూరి, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.