బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్: ట్రయల్ రన్ పూర్తి
అత్యవసర పరిస్థితుల్లో విమానాలు అత్యవసర ల్యాండింగ్ కు అనువుగా తయారు చేసిన రన్ వేలో ట్రయల్ రన్ ను బాపట్ల జిల్లాలో ఇవాళ పూర్తి చేశారు. కొరిశపాడు -రేణింగవరం మధ్య రన్ వేపై విమానాలు ఇవాళ చక్కర్లు కొట్టాయి.
బాపట్ల:జిల్లాలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ ను గురువారం నాడు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని కొరిశపాడు -రేణింగవరం మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బాపట్ల జిల్లాలోని కొరిశపాడు- రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు.దేశంలో ఈ తరహ రన్ వేలను 19 ఏర్పాటు చేస్తున్నారు. అత్వసర సమయలాల్లో విమానాల ల్యాండింగ్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో విమానాలు సురక్షితంగా ల్యాండయ్యేలా రన్ వేను నిర్మిస్తున్నారు.
కొరిశపాడు -రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై 4.1 కిమీ., దూరంలో రన్ వేను నిర్మించారు. వచ్చే ఏడాది లో ఈ రన్ వేను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. జెట్ విమానాలతో పాటు సరుకులు రవాణా చేసే విమానాలు కూడా ఈ రన్ వేపై ల్యాండయ్యేలా నిర్మించారు. ఇవాళ రెండు కార్గో విమానాలు, మూడు జెట్ విమానాలు ఈ రన్ వేపై ట్రయల్ రన్ ను నిర్వహించాయి, . విమానాల ల్యాండింగ్ కు అవసరమైన సిగ్నల్స్ కోసం రాడార్ వ్యవస్థతో సిగ్నల్స్ ను పంపారు. ఈ రన్ వేపై 100 మీటర్ల ఎత్తులో విమానాలు ట్రయల్ రన్ ను నిర్వహించాయి. ఈ రన్ వేకు సంబంధించి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఈ రన్ వేకు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై నుండి వాహనాలు జాతీయ రహదారి ( రన్ వే)పైకి వచ్చేలా మార్గం ఉంది. అయితే ఈ రోడ్డును రన్ వేగా ఉపయోగించే సమయంలో సర్వీస్ రోడ్డుపై వాహనాలు రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో సర్వీస్ రోడ్డును మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
4.1 కి.మీ రన్ వేను జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. 60 మీటర్ల వెడల్పు,తో ఈ రన్ వే ఉంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులను బ్లాక్ చేసి విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ఉపయోగించనున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేసే సమయంలో ఈ రన్ వేలను ఉపయోగించనున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు లేదా రైలు మార్గాల్లో అంతరాయం ఏర్పడిన సమయంలో విమానాల ద్వారా ఆ ప్రాంతాలకు చేరడానికి జాతీయ రహదారులను రన్ వేగా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది., 2021 నవంబర్ 16న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేలో తొలి రన్ వేను ప్రధాని మోడీ ప్రారంభించారు.