Cyclone Asani: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అసాని' తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో ప్రతికూల వాతావరణం కారణంగా  విశాఖ విమానాశ్రయంలో విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. తీర ప్రాంతంలో గాలులు వేగం వీయ‌డంతో సోమవారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. 

Cyclone Asani: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొసాగుతున్న అసని తుఫాన్ తీవ్రంగా మారింది. ఇది వాయువ్యదిశగా ప్రయాణిస్తుందని.. మే 10వ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరంలోని పశ్చిమ ప్రాంతానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 100 కి.మీపైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన‌ విమానాలను విశాఖపట్నం విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయలేక వెనక్కి పంపించాల్సి వచ్చింది. అలాగే.. హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయవాడ నుంచి వివిధ విమానయాన సంస్థల విమానాలు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి.

ఈ త‌రుణంలో ఉత్తర కోస్తా ఆంధ్రా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చ‌రించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ బి.ఆర్. ముందుజాగ్రత్త చర్యగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) అప్రమత్తంగా ఉన్నాయని అమేబ్ద్కర్ చెప్పారు.

Cyclone Asani అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక, ప్రస్తుతం అసని తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో గంటకు 19 కి.మీ వేగంతో ఈ తుఫాన్ ప్రయాణిస్తూ దిశ మార్చుకునే అవకాశం ఉందని అంచనా . మరోవైపు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 

ఇక, Cyclone Asani ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే 10, 11 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు సాయంత్రం నుంచి ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మే 11న ఒడిశా కోస్తా తీరం, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.