న్యూఢిల్లీ: రాజ్యసభలో  టీడీపీపీ  బీజేపీలో విలీనం చెల్లుబాటు కాదని... పార్టీ మారిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. 

అయితే ఇప్పటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలే ఉన్నట్టుగా చూపించారు. బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలుగా ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.అయితే రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేసినట్టుగా బులెటిన్ విడుదల కాలేదు. ఈ విషయమై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ధృవీకరించారని  టీడీపీ ఎంపీలు తెలిపారు.

రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం చేయాలని  నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్‌లు గురువారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.

అయితే  ఈ లేఖపై లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, తోట సీత మహాలక్ష్మిలు శుక్రవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.

టీడీపీపీ సమావేశం జరిగిందని.... ఈ సమావేశంలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకొంటూ ఈ నలుగురు ఎంపీలు వెంకయ్యనాయుడుకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీల విలీనాన్ని ఈసీ చేయాలని....చట్టసభల్లో ఈ వ్యవహరం పూర్తి చేయలేరని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

టీడీపీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ ఈసీ చేయాలి.. అలాంటి ప్రక్రియ జరగనే లేదు... అలాంటి సమయంలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడం నిబంధనలకు విరుద్దమని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

సాంకేతిక అంశాలను  ఐదుగురు టీడీపీ ఎంపీలు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి తమ వాదనను విన్పించారు. టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కూడ కోరారు. అయితే రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమకు చెప్పారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ గుర్తు చేశారు.

టీడీపీపీని బీజేపీలో విలీనం చేసినట్టుగా ఎలాంటి బులెటిన్ కూడ విడుదల కాలేదు. కానీ, రాజ్యసభ వెబ్‌సైట్‌లో మాత్రం రాజ్యసభలో  టీడీపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నట్టుగా చూపించారు. అయితే న్యాయ నిపుణుల సలహాను తీసుకొని  చర్యలు తీసుకొంటానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చినట్టుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర చెప్పారు.