విజయవాడ: కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండల  పరిధిలోని మడ అడవిలోని జలాశయాల్లో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల్లో నలుగురు గల్లంతవగా ఒకరు మృత్యువాతపడ్డారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృత్తివెన్ను మండలం గుడిదిబ్బపల్లి పాలెం,  ఓర్లగొందితిప్ప గ్రామాలకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సమీపంలోని మడ అడవుల్లో  చేపలవేటకు వెళ్లారు. అయితే జలాశయాల్లో వలలు కడుతుండగా ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయ్యింది. దీంతో ఆరుగురిలో నలుగురు గల్లంతవగా ఒకరు మృత్యువాత పడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు, అధికారులు గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. గుడిదిబ్బపల్లె పాలెం నుండి వెళ్లిన వారిలో ఒకరు మృతి ఇద్దరు గల్లంతవగా ఒర్లగొంది తిప్ప కు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు.  

ఒర్లగొంది పాలెంకు చెందిన మత్స్యకారులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. జల్లా పెద్ది రాజులు, జల్లా లక్షణాస్వామి, జల్లా వెంకటెశ్వరావు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దుర్ఘటనతో ఇరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మత్స్యకారుల కుటుంబసభ్యులు తమవారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గళ్లంతయిన వారికోసం గాలింపు కొనసాగుతోంది.