గోదావరి నదికి వరద పోటెత్తింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద ఆదివారం నాడు మధ్యాహ్నం 9,41,146 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరింది. ముందుజాగ్రత్తగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిన అధికారులు సిద్దం చేశారు.
రాజమండ్రి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఆదివారం నాడు మధ్యాహ్నానికి 9,41,146 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం నుండి సముద్రంలోకి చేరింది. గోదావరికి భారీగా వరద పోటెత్తడంతో రెస్యూ ఆపరేషన్స్ కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడ సిద్దం చేశారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను సిద్దం చేశారు. ముంపు మండలాల అధికారులను అధికారులు అప్రమత్తం చేసింది ఏపీ ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా చింతూరు లో రెండు బృందాలు, వి.ఆర్ పురంలో ఒక బృందం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయి.సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కోరింది. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని సూచించింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం,చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు.
