బెజవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లైఓవర్‌ కింద ఇంటర్నెట్‌ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు

విజయవాడలోని (Vijayawada) కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద (kanakadurga flyover) గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలతోపాటు పేలుడు శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. ఎప్పుడూ వీఐపీలు తిరిగే ఈ మార్గంలో మంటలు రావడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. దీంతో రైల్వే సిబ్బంది, అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. 

ఫ్లైఓవర్‌ కింద ఇంటర్నెట్‌ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్నెట్‌ కేబుళ్లు లాగిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు.