దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకొని దాదాపు రూ.50లక్షల ఆస్తి నష్టం నెలకొంది. ఈ సంఘటన కడపలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... దసరా వేడుకల్లో భాగంగా  మంగళవారం కడపలో దుర్గా మాతను ఊరేగించారు. ఈ ఊరేగింపులో భాగంగా భక్తులు బాణసంచా కాల్చారు.

ఆ సమయంలో నిప్పు రవ్వలు ఎగసిపడి.. ఓ గోదాంలోని అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించకపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. గోదాం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో దాదాపు రూ.50లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.