పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.తూ.గో జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద పడవలో మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పడవలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. పోశమ్మగండి నుంచి పాపికొండల యాత్రకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

బోటు పాతకాలం నాటిది కావడంతో ఇంజిన్ పాడయ్యి.. ఈ సమస్య తలెత్తినట్లు పలువురు భావిస్తున్నారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులను మరో పడవలోకి ఎక్కించి రక్షించినట్లు తెలిపారు. అనుకోకుండా ఒక్కసారిగా పడవలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినప్పటికీ.. ప్రమాదం షాక్ నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయమే పట్టింది.