Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం... ముగ్గురు సజీవదహనం..

చిత్తూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. 

fire accident at paper plates manufacturing industry, kills three in Chittoor
Author
First Published Sep 21, 2022, 6:40 AM IST

చిత్తూరు : చిత్తూరులో అగ్నిప్రమాదం విషాదాన్ని సృష్టించింది.  పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో చెలరేగిన మంటలు ముగ్గురు వ్యక్తులను సజీవదహనం చేశాయి. ఈ సంఘటన చిత్తూరులోని రంగాచారి వీధిలో చోటు చేసుకుంది. మృతులు  భాస్కర్ (65), ఢిల్లీ బాబు(35), బాలాజీ(25)గా గుర్తించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో మంటలను ఆర్పి వేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సికింద్రాబాద్ లో గత సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న పదిమంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల వయస్సు 35 నుంచి 40 ఏళ్ల లోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఏ. హరీష్,  చెన్నై వాసి సీతారామన్ ఢిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.

వైరల్ ఫీవర్‌తోనే చిన్నారి సంధ్య మృతి.. అన్నింటినీ రాజకీయం చేయొద్దు : టీడీపీపై మంత్రి రజనీ ఫైర్

ఎలక్ట్రిక్ వాహనాలు షోరూంలో చెలరేగిన మంటలతో.. పై అంతస్తులో ఉన్న లాడ్జీలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు. పొగ దట్టంగా వ్యాపించడంతో పలువురు స్పృహ కోల్పోయి లాడ్జిలోని గదులు,  ఆవరణలో పడి ఉన్నారు. క్షతగాత్రులను గాంధీఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోండా మార్కెట్ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి…సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ఫ్రైడ్ పేరిట ఐదు అంతస్తుల భవనం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో  హోటల్ నిర్వహిస్తున్నారు.  

సోమవారం రాత్రి  9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షో రూమ్ లోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల  మంటల ఉధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మెట్ల మార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు వాహనాలు,  బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే  అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి.

లాడ్జిలో మొత్తం ఇరవై మూడు గదులు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు.  విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందో అని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన  పొగ కారణంగా ఊపిరి ఆడక  కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో,  కారిడార్లో పడిపోయారు. దట్టంగా పొగ చూడడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందికి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు హైడ్రాలిక్ క్రేన్  తీసుకువచ్చి లాడ్జిలో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 30 మంది వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నట్లు  గాంధీ హాస్పిటల్ సూపర్డెంట్ రాజారావు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios