జగన్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు లేవు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.

గుంటూరు: వైసిపి ప్రభుత్వ పాలన సాగిన ఈ రెండేళ్లలోనే రూ.4లక్షల 45వేల కోట్ల వరకు అప్పులు చేశారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అప్పులు ఇలాగే కొనసాగితే 2024 వచ్చేసరికి అది 6లక్షల కోట్లు అవుతుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు లేవు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇటీవలి బడ్జెట్లో, ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లో అంతా అంకెలు చెప్పారు గానీ వాస్తవాలు చెప్పలేదని... రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్లబోతోందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.

''వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ముద్రించిన పుస్తకమంతా అబద్ధాల పుట్ట. వాస్తవాలు, ప్రస్తుత పరిస్థితులు ఎక్కడా పుస్తకంలో ప్రస్తావనకు రాలేదు. రెండేళ్ల తన పాలనపై ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే అసత్యాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. అధికారం చేతిలో పెట్టుకొని ప్రతిపక్షాలను అణిచేస్తూ, ప్రజలను మభ్యపెట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నాడు. అక్రమంగా సంపాదించడం, రాజకీయంగా ప్రతిపక్షాలను అణిచివేయడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమనే మూడు లక్ష్యాలతో ముఖ్యమంత్రి ముందుకుపోతున్నాడు'' అని యనమల ఆరోపించారు. 

''తన కేసుల గురించి కేంద్రంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని అడగలేకపోతున్నాడు. చట్టాలను, చట్టసభలను గౌరవించేలా ముఖ్యమంత్రి ఏనాడైనా వ్యవహరించాడా? రాజ్యాంగ విలువలను, న్యాయ వ్యవస్థలను గౌరవించేలా నడుచుకున్నాడా? ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అన్న వ్యక్తి ఇప్పుడు కేసుల భయంతో దాని ఊసే ఎత్తడం లేదు'' అని విమర్శించారు.

''చివరకు ఆర్డినెన్స్ ల రూపంలో బడ్జెట్ ఆమోదించుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చాడు. బ్యూరోక్రసీ, పోలీస్ వ్యవస్థతో సాగుతున్న పాలన ప్రజారంజకంగా ఉన్నట్టా? మీడియాను కట్టడిచేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ -19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను హరించడం కాదా?'' అని నిలదీశారు.

''2018-19లో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 36.32శాతం వరకు ఎకనామిక్ సర్వీసెస్ కు ఖర్చుపెట్టాం. కానీ 2019-20 లో 22.19శాతం, 2020-21 లో24.91శాతమే ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక తయారుచేసిన బడ్జెట్ పుస్తకంలోని లెక్కలే. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పడానికి బడ్జెట్ లో ఎకనామిక్ సర్వీసెస్ కు చేసిన కేటాయింపులే నిదర్శనం'' అన్నారు. 

read more బెయిల్ రద్దు పిటిషన్: కౌంటర్ దాఖలు చేసిన జగన్, విచారణ ఈ నెల 14కి వాయిదా

'' 2018-19లో 16,859కోట్లు కేపిటల్ ఎక్స్ పెండేచర్ కి తాము ఖర్చుపెట్టాము. ఈ ప్రభుత్వం 2019-20లో రూ.12,248కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. ఆదాయం లేదు కోవిడ్ వల్ల పడిపోయిందంటున్నారు. ఇదే కోవిడ్ సమయంలోనే మద్యంపై ఆదాయం ఎలా పెరిగింది? అని ప్రశ్నించారు. 

''రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. రెండేళ్లలోనే ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి? 28 శాతంనుంచి 38శాతానికి పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. కానీ సంక్షేమం బాగా చేశామని పుస్తకంలో చెప్పుకున్నారు. రూ.1,7826కోట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన 17సంక్షేమ పథకాలను జగన్ ఎందుకు రద్దు చేశాడు? పాత పథకాలకు పేర్లు మార్చడం, ఉన్నవాటిని తీసేయడమేనా మీరు చేసిన సంక్షేమం?'' అని నిలదీశారు. 

''ఆర్థికంగా రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా కేంద్రంపైనే ఆధారపడుతోంది. వేజ్ అండ్ మీన్స్ కు రూ.60వేలకోట్లకు పైగా ఖర్చుపెట్టారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్, ఎకనామిక్ సర్వీసెస్ కు ఖర్చుపెట్టకుండా, సంక్షేమానికి అరకొరగా కేటాయిస్తూ, అంతా బాగాచేశామనడం అబద్ధం కాదా? రాష్ట్ర ఆదాయం, అప్పు తెస్తున్నసొమ్మంతా ఎక్కడికిపోతోందో ముఖ్యమంత్రి చెప్పాలి'' అని అడిగారు.

''జీఎస్ డీపీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ లపై ఎందుకు ఆదాయం రావడంలేదో పుస్తకంలో ప్రస్తావించలేదేం? ముఖ్యమంత్రి అనాలోచిత చర్యలతో పేద మధ్య తరగతి వర్గాలకే ఎక్కువ నష్టం.అంతా బాగుందని పుస్తకం ముద్రించిన ముఖ్యమంత్రే వీటన్నింటికీ సమాధానం చెప్పాలి'' అని యనమల నిలదీశారు.