దేశంలోని పది రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అవకాశం కల్పించింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా అదనపు అప్పులకు అవకాశం కల్పించింది
దేశంలోని పది రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అవకాశం కల్పించింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా అదనపు అప్పులకు అవకాశం కల్పించింది. ఈ పది రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీకి అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. మొత్తంగా పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనప్పు అప్పులు చేయడానికి అనుమతి ఇచ్చింది.
విద్యుత్ రంగంలో రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా.. 2021-22 నుంచి 2024-25 వరకు నాలుగు సంవత్సరాల కాలానికి ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు జీఎస్‌డీపీలో 0.5 శాతం వరకు అదనపు రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్రాలు విద్యుత్ రంగంలో సంస్కరణలతో అనుసంధానించబడిన అదనపు రుణాల సౌకర్యాన్ని పొందవచ్చు. 2022-23లో ఈ సంస్కరణలను చేపట్టేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రూ. 1,22,551 కోట్లు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021-22లో సంస్కరణ ప్రక్రియను పూర్తి చేయలేని రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్కరణలు చేపడితే.. 2022-23కి కేటాయించిన అదనపు రుణాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చని వెల్లడించింది.
అదనపు అప్పులు తీసుకోవడానికి అనుమతించబడిన రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,716 కోట్లు, అస్సాంకు రూ. 1,886 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 251 కోట్లు, మణిపూర్‌కు రూ. 180 కోట్లు, మేఘాలయకు రూ. 192 కోట్లు, ఒడిశాకు రూ. 2,725 కోట్లు, రాజస్తాన్‌కు రూ. 5,186 కోట్లు, సిక్కింకు రూ. 191 కోట్లు, తమిళనాడుకు రూ. 7,054 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ. 6,823 కోట్లు తీసుకునే అవకాశం కల్పించారు.
