‘అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా’ అన్నది పాత సినిమాలోని ఓ పాపులర్ పాట. ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం రాసిన పై పాట ఇప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే, రాష్ట్రవిభజన తర్వాత లోటు బడ్జెట్ తో మొదలైన ప్రభుత్వాన్ని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసారు. విభజన జరిగినపుడు ఏపి అప్పులు సుమారు రూ 90 కోట్లుంటే ఇప్పటికి ఆ అప్పు రూ. 2.05 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే, రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిపై ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారమే సమీక్ష చేసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘ఆదాయం ఆశాజనకంగా లేదు..అప్పులతోనే నడుపుతున్నాం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం చేయాల్సిన అప్పులంతా చేసేసారు. ఇంకా అప్పులు కావాలి. కానీ ఇచ్చే నాదుడే లేడు. అందుకనే రాష్ట్రంలో ఉన్న వివిధ కార్పొరేషన్లను అప్పులు తెచ్చుకోమని చెబుతున్నారట. కార్పొరేషన్లు అప్పులు తెచ్చుకుంటే రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందట. ఎలా ఇస్తుంది గ్యారెంటీ?

రాష్ట్రప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీని చూసి అప్పులు ఎవరైనా ఇస్తారా? గ్యారెంటీ అంటే ఏంటి? అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే వారికి బదులు తాను అప్పు తీరుస్తానని ఇచ్చే హామీనే కదా? అప్పు తీసుకున్న కార్పొరేషన్ కు బదులు బాకీ తీర్చే శక్తే ఉంటే ఆ డబ్బేదో నేరుగా ఆ కార్పొరేషన్ కు ప్రభుత్వమే సర్దుబాటు చేయవచ్చు కదా? అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. అప్పు తెచ్చుకొనేది కార్పొరేషన్, వాడుకునేది ప్రభుత్వం. మొదటి 9 నెలల్లో తీసుకోవాల్సిన అప్పును ప్రభుత్వం 6 నెలల్లోనే తీసేసుకుందట. అందుకే ఎవరూ అప్పులు ఇవ్వటం లేదు.

రుణమాఫీ కోసం రైతు సాధికార సంస్ధ, ఆర్టీసీ, పౌరసరఫరాలు, విద్యుత్, నీటిపారుదల కార్పొరేషన్లను అప్పులు తీసుకోమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి ఎంత ఘనంగా చెప్పారో. అప్పులు చేయమని ప్రోత్సహించటం చంద్రబాబు 40 రాజకీయ ఏళ్ళ అనుభవానికి మచ్చుతునకగా నిలిచిపోతుంది. రాష్ట్ర ఆదాయం నిరాశాజనకంగా ఉందని యనమల చెప్పారు.

పోయిన ఎన్నికల నాటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఏంటో చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. తెలిసీ ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీలిచ్చారు. అధికారంలోకి రాగానే ఉచిత కానుకలు, ప్రత్యేక విమానాల కోసం వందల కోట్ల రూపాయల దుబారా, శంకుస్ధాపనల పేరుతో కోట్ల రూపాయల వృధా చేసారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలు వేల కోట్ల రూపాయలు పెంచేసారు. పరిపాలన ఇంత అస్తవ్యస్తంగా ఉన్న తర్వాత రాష్ట్రం అప్పుల్లో కాక మిగులు బడ్జెట్ లో ఎలా ఉంటుంది?