అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఆర్ధిక అత్యవసర పరిస్థితి(ఫైనాన్స్ ఎమర్జెన్సీ) నెలకొందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. మూలధన వ్యయంపై, అప్పులపై మార్గదర్శకాలు సూచిస్తూ కేంద్రం రాసిన హెచ్చరిక లేఖ రాష్ట్రంలో ఆర్ధిక వైఫల్యాలకు అద్దం పడుతోందన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం ప్రతి క్వార్టర్ లో మూలధన వ్యయంపై కేంద్రం సమీక్షిస్తూ తర్వాత క్వార్టర్ అప్పులను ఖరారు చేస్తోందన్నారు. 

''2020-21బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర పన్నురాబడి రూ 70,679కోట్లు కాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్  రూ 49వేల కోట్ల పైచిలుకుతో కలిపి మొత్తం అప్పులు రూ 1.23లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అంటే చెల్లింపులు మినహాయిస్తే, నికర అప్పు రూ 77వేల కోట్లు. 2020-21లో గరిష్ట అప్పుల కారణంగా ఇకపై  చెల్లింపులు కూడా రెట్టింపు అవుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇకపై విచ్చలవిడి అప్పులు చేయడానికి కేంద్రం అనుమతి ఉండక పోవడం,  గతంలో తెచ్చిన అప్పుల చెల్లింపులు గరిష్టంగా ఉండటాన్ని రాష్ట్రం నివారించలేక పోవడం ప్రస్తుత మరో విపత్కర పరిస్థితి. కనిష్ట అప్పులు, గరిష్ట చెల్లింపుల కారణంగా ఏపి ఆర్ధిక పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడనుంది, నగదు నిర్వహణను మరింత క్లిష్టతరం చేయనుంది'' అని యనమల ఆందోలన వ్యక్తం చేశారు. 

''నికర రుణంలో 64%(రూ 49,280కోట్లు)మూలధన వ్యయంపై ఖర్చు చేయాల్సి వుంటుంది కేంద్రం రాసిన మార్గదర్శకాల లేఖ ప్రకారం. కానీ మూలధన వ్యయం రివైజ్డ్ చూస్తే కేవలం రూ 19వేల కోట్ల పైచిలుకు మాత్రమే ఉండటం గమనార్హం, ఇది కేంద్రం పేర్కొన్న రూ49,280కోట్లలో సగం కూడా లేకపోవడం ఆందోళనకరం. కేంద్రం చెప్పిన మూలధన వ్యయం రూ49,280కోట్లు ఎక్కడ..? రాష్ట్రం ఖర్చుచేసిన మూలధన వ్యయం రూ19వేల కోట్లు ఎక్కడ..? హస్తిమ శకాంతం భేదం ఉంది. రాష్ట్రం చేసిన మూలధన వ్యయం కన్నా ఇంకా మరో రూ30వేల కోట్లు అదనంగా చేయాల్సి వుంది. ఆ సామర్ధ్యం జగన్ రెడ్డి ప్రభుత్వానికి లోపించడం దారుణ వైఫల్యం'' అన్నారు.

read more   వెంకన్నపై ప్రమాణానికి లోకేష్ రెడీ...జగన్ రెడ్డి రెడీనా?: మాజీ మంత్రి సవాల్

''వాస్తవానికి ఖర్చుల పద్దులు చూస్తుంటే రెవిన్యూ వ్యయానికి హద్దుపద్దు లేదు,132%పైగా రెవిన్యూ వ్యయం ఉంది.ఈ పరిస్థితులలో దుబారా ఖర్చులు తగ్గించుకుని, రెవిన్యూ వ్యయాన్ని అదుపు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి బహు క్లిష్టం.కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా నికర  రుణంలో పెట్టుబడి వ్యయానికి తొలి క్వార్టర్ లో 20%, ప్రథమార్ధంలో 45%, 9నెలల్లో 70% ఖర్చు పెట్టడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఉండదు, దానిని పాటించాల్సిందే..ఈ లేఖలో సూచించిన అంశాలను రాష్ట్రం పాటించకపోతే అది కేంద్రం మార్గదర్శకాలను ఉల్లంఘించడం కిందకే వస్తుంది లేదా కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో, ఆర్ధిక సంస్థలు కేటాయించే నిధులకు అడ్డుకట్ట పడటం అనివార్యం'' అని యనమల పేర్కొన్నారు. 

''ఇప్పటికే జగన్ రెడ్డి ప్రభుత్వం రెవిన్యూ లోటు 3-4% మరియు ద్రవ్యలోటు 13%, ప్రాథమిక లోటు 2-3% మరియు జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 35%కు చేరుకుంది. ఎఫ్ ఆర్ బిఎం పేర్కొన్న పరిమితులను ఈ పారామీటర్లు అధిగమించి ఉండటమే కాకుండా వాటికి ఎంతో సుదూరంగా ఉన్నాయి. ఈ ఆర్ధిక సంక్షోభం నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో బైటపడే అవకాశం మచ్చుకి కూడా కనిపించకపోగా, రాష్ట్రంలో అటు అభివృద్ది పనులకు గుండు సున్నా చుట్టారు, నవరత్నాలలో తాను పేర్కొన్న పేదల సంక్షేమానికి పంగనామాలు పెట్టారు. తన చేతగాని పాలనతో చివరికి భూముల అమ్మకానికి కూడా తెగబడ్డారు, బంగారం లాంటి రాష్ట్రాన్ని దివాలా తీయించిన సిఎం జగన్ రెడ్డి'' అని మండిపడ్డారు. 

''తలసరి ఆదాయంలో వృద్ది టిడిపి హయాంలో గరిష్టంగా 15%ఉంటే, వైసిపి వచ్చాక గత ఏడాది 1.03%కు పడిపోయింది. వరుసగా 5ఏళ్లు డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటే ఇప్పుడది సింగిల్ డిజిట్ కు దిగజార్చారు. జిఎస్ డిపి వృద్ది కూడా దిగజారడం ఆందోళనకరం. తన అసమర్ధత, అహంభావం, అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును బలి పెడుతున్నారు'' అని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.