ఇంతకాలం జరిగిందాన్ని గురించి మరచిపోండంటూ బాలకృష్ణ తరపున అందరికీ వర్తమానం అందింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ వ్యవహారం. సినిమాలు వేరు జీవితం వేరని మొత్తానికి నందమూరి నటసింహానికి బాగానే అర్ధమైనట్లుంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ కు దిగారు. పిఏ శేఖర్ నిర్వాకం వల్ల హిందుపురం నియోజకవర్గంలోనే కాక మొత్తం రాష్ట్రమంతా బాలకృష్ణ గబ్బుపట్టిపోయారు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి బాలకృష్ణ నియోజకవర్గాన్ని సినిమాల్లో లాగ పిఏకి రాసిచ్చేసారు. దాంతో అక్కడ అరాచకం మొదలైంది. ప్రతీ పనికి ఇంత అని రేటు కట్టి మరీ పిఏ వసూలు మొదలుపెట్టారు. పార్టీని దశాబ్దాల పాటు అంటిపెట్టుకుని వున్న నేతలను కూడా తీవ్ర అవమానాలకు గురిచేసారు. చాలా మందిని పార్టీ నుండి సస్పెండ్ చేయించటమే కాకుండా కొంతమందిపై కేసులు కూడా పెట్టించారు.

పిఏ నిర్వాకాన్ని బాలకృష్ణతో చెబుదామంటే అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు, లోకేష్ కు చెప్పినా పట్టించుకోలేదు. దాంతో ఒళ్ళుమండిన నేతలంతా పూర్తిగా ఎదురుతిరిగారు. జడ్పిటిసి, ఎంపిపిలు, పార్టీ పదవుల్లో ఉన్నవారంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలకు సిద్ధపడ్డారు. నియోజకవర్గానికి ఎంఎల్ఏ బాలకృష్ణా లేక శేఖరా అన్నంతగా సాగింది పిఏ ఆటలు. ఏమంత్రి, ఎంపి, ఎంఎల్ఏ ఆఖరుకు కలెక్టర్, ఎస్పీ కూడా శేఖర్ అనుమతి లేనిదే హిందుపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేకపోయారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ గబ్బుపట్టిపోయింది.

దాంతో చంద్రబాబు, లోకేష్ కు పరిస్ధితి అర్ధమైంది. బాలకృష్ణతో మాట్లాడి, పిఏని నియోజకవర్గానికి దూరంగా పెట్టేట్లు ఒప్పించారు. అదే విషయాన్ని నియోజకవర్గంలోని నేతలకూ తెలియజేసారు. చివరకు పట్టిన గబ్బును వదిలించుకునేందుకు బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఇంతకాలం జరిగిందాన్ని గురించి మరచిపోండంటూ బాలకృష్ణ తరపున అందరికీ వర్తమానం అందింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. సినిమాల్లో లాగ తానేం చేసినా చెల్లుబాటవతుందని అనుకున్న బాలయ్య చివరకు వాస్తవంలోకి రాక తప్పలేదు.