శ్రీకాకుళం: కేవలం త్రాగునీటి కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఇరువర్గాల దాడిలో దాదాపు 25మంది తీవ్రంగా గాయపడగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం పందిగుంట గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొని వుంది. ఈ  నేపథ్యంలో నీటి కోళాయి విషయంలో చిన్నగా మొదలైన వివాదం పార్టీలుగా విడిపోయి దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. అధికార వైసిపి- ప్రతిపక్ష టిడిపి లకు చెందిన రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడుకున్నారు. 

read more  కిలోల కొద్ది బంగారం, వెండి... తెలంగాణ నుండి ఏపికి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా

దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాలతో గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

ఈ గొడవలో 25 మంది తీవ్రంగా గాయపడిన వారిని కోట బొమ్మాళి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించారు.