Asianet News TeluguAsianet News Telugu

నారా లోకేష్ మెడకు ఫైబర్ గ్రిడ్ కేసు: బ్రాహ్మణి చేతుల్లోకి టిడిపి, బాలక్రిష్ణ సైడ్

ఫైబర్ గ్రిడ్ కేసులో ఎపి సిఐడి టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో టీడిపి బాధ్యతను నారా బ్రాహ్మణి చేపట్టవచ్చునని సమాచారం.

Fiber Grid case on Nara Lokesh, Brahmani may take over TDP kpr
Author
First Published Sep 18, 2023, 8:30 AM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెడకు ఫైబర్ గ్రిడ్ కేసు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో సిఐడి కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కూడా అరెస్టవుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తర్వాతి వంతు లోకేష్ దేనని మంత్రి అమర్నాథ్ అన్న విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ ను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా అన్నారు.

నారా లోకేష్ కూడా అరెస్టయి జైలులో ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. లోకేష్ అరెస్టు అయితే ఏం చేయాలనే విషయంపై ఇప్పటికే టిడిపి ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. టిడిపి ప్లాన్ బిని సిద్ధం చేసిందని మీడియా వార్తలు వచ్చాయి. నారా లోకేష్ అరెస్టయితే నారా బ్రాహ్మణిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. ఆమెకు టిడిపి పగ్గాలను అప్పగించే అవకాశాలున్నాయి. బాలక్రిష్ణ ఆ బాధ్యతలు చేపట్టవచ్చునని భావించారు. అయితే, చంద్రబాబు పార్టీని తన కుటుంబ సభ్యుల్లోనే పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో నారా బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.

నారా బ్రాహ్మణి నాయకత్వం విషయంపై వచ్చే వారం స్పష్టత రావచ్చునని టిడిపి అనుకూల పత్రిక అభిప్రాయపడింది. స్కిల్ డెవలప్ మెంటు కుంభకోణం కేసులో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అది మంగళవారం విచారణకు వస్తుంది. అయితే, చంద్రబాబుపై ఇప్పటికే మరిన్ని కేసులు బనాయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఇప్పటికే వారంట్ జారీ చేశారు. అంగల్ల అల్లర్ల కేసులో కూడా చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చారు. వరుస కేసులు పెట్టడం ద్వారా చంద్రబాబు జైలులోనే ఉండేలా ప్రభుత్వం వ్యూహం ఖరారు చేసి అమలు చేస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబుపై కేసు మీద కేసు బనాయిస్తూ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు సిఐడి రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ కేసులో సిఐడి నలుగురిని అరెస్టు చేసింది. వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ కేసును తిరిగి ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవహారం సాగిన కాలంలో నారా లోకేష్ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రిగా ఉన్నారు. నిజానికి, ఫైబర్ గ్రిడ్ అనేది పరిశ్రమలు, మౌలిక సదుపాయాల (ఐ అండ్ ఐ) విభాగంలోనిది. అయితే, ఆ విభాగాన్ని చూసిన అధికారే అప్పట్లో ఐటి కార్యదర్శిగా ఉన్నారు.అధికారికమైన పని మీద ఆయన ఢిల్లీ వెళ్లేందుకు నారా లోకేష్ అనుమతి ఇచ్చారు.

ఈ-గవర్నెన్స్ పాలక మండలి సభ్యుడైన వేమూరి హరిప్రసాద్ కు టెరాసాఫ్ట్ కంపెనీ సన్నిహితమైందనే ఆరోపణలు చేశారు. ఈ స్థితిలో ఫైబర్ గ్రిడ్ సంస్థలో సిబ్బంది నియామకానికి షెల్ కంపెనీ ఏర్పాటు చేశారని కూడా ఆరోపించారు. విదేశాల్లో ఉన్న వేమూరి హరిప్రసాద్ కూతురుకు రూజ1.35 లక్షల వేతనం చెల్లించారని, ఆయన భార్య పేరు మీద ఓ ఫ్లాట్ కొనడానికి రూ.39 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని కూడా ఆరోపణలు చేశారు. ఆ రకంగా మొత్తం రూ.284 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఆప్పట్లో ఐ అండ్ ఐ అధికారిగా పనిచేసిన సాంబశివరావుతో పాటు నలుగురిని ఈ కేసులో అరెస్టు చేశారు. వారందరికీ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. రెండేళ్ల క్రితం ఆగిపోయిన కేసు దర్యాప్తును తిరిగి చేపట్టి నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు.

ఈ స్థితిలో నారా లోకేష్ అరెస్టు కనుక జరిగితే నారా బ్రాహ్మణి టిడిపి నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి మీడియా ముందుకు వచ్చారు. నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios