Asianet News TeluguAsianet News Telugu

ఆశలు రేపుతున్న పొత్తులు, అజ్ఞాతం వీడుతున్న నేతలు

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తులు కొంతమంది గుండెల్లో గుబులు రేపుతుంటే మరికొంతమందికి ఆశలు రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలు తమ సీట్లకు ఎక్కడ ఎసరువస్తుందోనని ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు, కురువృద్ధుల్లో ఆశలు రేపుతోంది. పదేళ్ల వరకు ఏపీలో రాజకీయాలు చెయ్యలేమని భావించి అజ్ఞాత వాసం చేస్తున్న పలువురు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నేతలు ఇప్పుడు నేరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. 

Few Congess leaders happy with TDP alliance
Author
Visakhapatnam, First Published Nov 6, 2018, 10:57 AM IST

విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తులు కొంతమంది గుండెల్లో గుబులు రేపుతుంటే మరికొంతమందికి ఆశలు రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలు తమ సీట్లకు ఎక్కడ ఎసరువస్తుందోనని ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు, కురువృద్ధుల్లో ఆశలు రేపుతోంది. పదేళ్ల వరకు ఏపీలో రాజకీయాలు చెయ్యలేమని భావించి అజ్ఞాత వాసం చేస్తున్న పలువురు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నేతలు ఇప్పుడు నేరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. 

ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతలుగా మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డిలను చెప్పుకోవచ్చు. అరకు పార్లమెంట్ సభ్యుడిగా పలుసార్లు గెలుపొంది కేంద్రమంత్రిగా విధులు నిర్వహించిన వ్యక్తి కిశోర్ చంద్రదేవ్. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహతుల్లో ఈయన ఒకరు. అయితే గత ఎన్నికల్లో వైరిచర్ల అరకు ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. 

2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన అడ్రస్ గల్లంతైంది. అదే వేవ్ లో కిశోర్ చంద్రదేవ్ కూడా కొట్టుకుపోయారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపొందారు. గెలిచిన తర్వాత ఆమె టీడీపీ సానుభూతిపరురాలిగా మారిపోవడం, ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకోవడం కూడా జరిగిపోయింది. 

అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ పార్లమెంట్ పరిధి నుంచి అత్యధికంగా గెలుపొందిన వారిలో వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఒకరు. తాజాగా 2014లో ఆ రికార్డును వైసీపీ బ్రేక్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంత ప్రయత్నించినా అరకు పార్లమెంట్ లో పాగా వెయ్యలేకపోతుంది. గత ఎన్నికల్లో గెలుస్తుందని ఆశించి సాలూరు నియోజకవర్గానికి చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బరిలోకి దింపింది. అయినా ఆశలు ఫలించలేదు. 

దీంతో అరకు పార్లమెంట్ పై టీడీపీ దాదాపు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. అయితే పొత్తులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కు వదిలేసే అవకాశం ఉంది. అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి అంతగా పట్టులేకపోవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కు వదిలెయ్యడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిందట.

దీంతో ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇంటి నుంచి బయటకు వస్తున్నారట. దీపావళి తర్వాత మళ్లీ తన రాజకీయ పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ఐదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటూ కోటకే పరిమితమైన ఆయనకు ఇప్పుడు పొత్తు కలిసొచ్చింది. దీంతో తన రాజకీయ భవితవ్యంపై ఆశలు పెట్టుకుంటున్నారు. 

మరోవైపు విశాఖపట్నం పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నేత టి.టి సుబ్బిరామిరెడ్డి ఎప్పటి నుంచో కన్నేశారు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందాలని ఆయన ఆశ. అందుకే విశాఖ కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొత్తులో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నారట టిఎస్సార్. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టుబట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో రెండు పార్లమెంట్ స్థానాలను వదులుకునే సాహసం టీడీపీ చెయ్యదు. జాతీయ స్థాయి రాజకీయాలు చెయ్యాలంటే అందుకు కనీసం 45 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలని భావిస్తున్న చంద్రబాబు ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకునే ఛాన్స్ ఉంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉంది. 

గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి వదిలేసింది టీడీపీ. దీంతో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు వైసీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మపై గెలుపొందారు. బీజేపీతో పొత్తు కటీఫ్ అయిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రణాళిక రచిస్తోంది. 

మెుత్తానికి టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు రాజకీయ అజ్ఞాతంలో ఉన్న నేతల్లో నూతనోత్తేజం నింపుతుంటే టీడీపీ నేతలు గుండెల్లో మాత్రం గుబులు రేపుతోంది. మరి ఎన్నికల సమయానికి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

 ఏపీలో కాంగ్రెస్-టీడీపీల పొత్తు అలజడి: గిడ్డి, వాసుపల్లికి హ్యాండ్

Follow Us:
Download App:
  • android
  • ios