కడప: కన్న కూతురిని అల్లుడు నిత్యం వేదించడం... వారి కాపురంలో కలహాలు చోటుచేసుకోవడాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకంటే దారుణం ఏంటంటే ఆ తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన ఓబుల్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు. భార్య లేకపోవడంతో ఇద్దరినీ అతడే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయితే పెద్ద కూతురు శ్వేతకు తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డికిచ్చి వివాహం చేశాడు. 

read more  స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం.. భార్య కోసం ఆగి..

అయితే సురేష్ రెడ్డి పెళ్లికి ముందు సాప్ట్ వేర్ ఉద్యోగినని చెప్పి  మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతడు ఎలాంటి ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరిగేవాడు. అంతేకాకుండా పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని భార్యను నిత్యం వేధించేవాడు. 

కూతురు పడుతున్న బాధలను చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. దీంతో మూడు రోజుల క్రితం ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన అల్లుడు కూతురిని హింసిస్తున్నాడని... ఆత్మహత్యకు కారకుడు అతనే అంటూ సెల్ఫీ వీడియో తీసి ఉరేసుకున్నాడు. అయితే తండ్రి ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన శ్వేత, సాయిప్రీతి కూడా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ ఆత్మహత్యలకు కారణమైన సురేష్‌కుమార్‌రెడ్డిని ఖాదర్‌బాద్‌ సమీపంలో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు పంపిస్తున్నామని వివరించారు.