విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  ఓ ప్రైవేటు ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్ ని లీజుకి తీసుకొని అక్కడ కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తోంది. కాగా అనుకోకుండా అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ ఘటన తర్వాత కొన్ని సంఘటనలు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి తన భార్య కోసం ఆగి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన పాస్టర్‌ బ్రదర్‌ సబ్బిట రత్న అబ్రహం(49), రాజకుమారి(45) దంపతులు స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో దుర్మరణం చెందారు. జూలై 31న కొవిడ్‌ లక్షణాలు కనిపించటంతో విజయవాడ రమేశ్‌ ఆస్పత్రికి వెళ్లారు. స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరి, చికిత్స పొందుతున్నారు. అబ్రహంకు నెగిటివ్‌ రావడంతో శనివారమే ఆయన్ను డిశ్చార్జి చేశారు. 

అయితే రాజకుమారిని మరో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి పంపుతామని వైద్యులు చెప్పడంతో ఇద్దరూ ఒకేసారి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో ఆయన కూడా హోటల్‌లో ఉండిపోయారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో రాజకుమారి గుర్తించటానికి వీలులేని స్థితిలో మంటల్లో కాలిపోయారు. ధరించిన దుస్తుల ఆధారంగా ఆమెను గుర్తించారు. వీరి కుమార్తె రత్న ఫెలిసిట డిగ్రీ ఫైనలియర్‌ చదువుతుండగా, కుమారుడు ఫెయిత్‌ ఇంటర్‌ పూర్తి చేశారు