అనకాపల్లిలో ఓ కామాంధుడు కన్నబిడ్డపైనే కన్నేశాడు. తల్లిలేని సమయంలో ఆమెను బయటికి తీసుకెళ్లాడు. ఓ గ్రామ శివారులో లైంగిక వేధింపులకు పాల్పడి బిడ్డను తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

విశాఖపట్నం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్నకూతురిపైనే కన్నేశాడు. ఆమె పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అనకాపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ అమానుష ఘటన సోమవారం బయటికి వచ్చింది.

అనకాపల్లి మండలంలోని శంకరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రూరల్ ఎస్ఐ నర్సింగరావు వివరించారు. శంకరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నబిడ్డను లైంగిక దృష్టితో చూశాడు. గత నెల 30న ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో బిడ్డపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఒక పథకం ప్రకారం, బిడ్డను బయటికి తీసుకెళ్లడానికి ఒప్పించాడు. నేరేడు పళ్లు కొసిస్తానని చెప్పి తల్లి లేని సమయంలో సమీపంలోని కోడూరు గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రదేశంలో కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడి గాయపరిచాడు.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బిడ్డను బెదిరించాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తండ్రిలోని ఈ వికృత కోణాన్ని చూసిన బాలిక బెంబేలెత్తిపోయింది. మానసికంగా, శారీరకంగా కుంగిపోవడం మొదలైంది. ఆమె ఇబ్బంది పడుతున్న విషయాన్ని తల్లి గమనించింది. ఏం జరిగిందని బిడ్డను తల్లి అడిగింది. ఏడుస్తూ బిడ్డ చెప్పడంతో తల్లి నిర్ఘాంతపోయింది. 

తల్లి ఆ విషయాన్ని జీర్ణించకోలేకపోయింది. వెంటనే ఆమె బంధువులకు చెప్పి భర్తను నిలదీస్తూ పంచాయితీ పెట్టించింది. అందరూ ఆయనను నిలదీశారు. తప్పుపట్టారు. గట్టిగా మందలించారు. అనంతరం, ఆదివారం రాత్రి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

Also Read: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రూ. 5 లక్షల బీమా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో అర్థరాత్రి దాటిన తర్వాత తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులు, ఇంటి ముందు ఉన్న కారుపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటలు ఒక్కపెట్టున ఎగిసిపడ్డాయి. ఇంటిలో నిద్రిస్తున్నవారు ఉలిక్కిపడి నిద్రలేచారు. వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నిందితుడు పరారీలో ఉన్నాడు.