కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే... కడుపున పుట్టిన కూతురిపై కన్నేశాడు. కూతురి జీవితాన్ని ఓ కసాయి తండ్రి నాశనం చేశాడు. మృగంలా ప్రవర్తించి కూతురిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి శారీరక హింసను భరించలేని బాలిక ఆశాసదన్‌లో చేరింది. అక్కడ నిర్వాహకులు విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  ప్రకాశం జిల్లా వెలిగండ్ల బీసీ కాలనీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడో సంతానమైన కుమార్తె స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. కూలి చేసుకొని జీవనం సాగించే అతడు ఫూటుగా మద్యం సేవించి వచ్చి తరచూ భార్య, పిల్లలను కొడుతుంటాడు. 

ఏడాది క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై మద్యం మత్తులో లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత పలు పర్యాయాలు అత్యాచారానికి పాల్పడ్డాడు.  తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ బాలికను దారుణంగా కాట్టి మరీ తన వాంఛ తీర్చుకునేవాడు.  ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు బాలిక చదువుతున్న పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
 

ఈ సందర్భంగా బాలసదన్‌తోపాటు, జిల్లాలో చిన్నారుల కోసం నడుపుతున్న పలు సదన్‌ల ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. ఈ క్రమంలో బాధితురాలు 20 రోజుల క్రితం నాగులుప్పలపాడు మండలం మాచవరంలోని ఆశా సదన్‌కు ఫోన్‌ చేసి తాను సదన్‌లో చేరతానని కోరింది. వారు అంగీకరించడంతో అక్కడికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఉన్నా ఆశాసదన్‌లో చేరడంపై బాలికను నిర్వాహకులు విచారించగా విషయం వెలుగుచూసింది. దీంతో వారు వెలిగండ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యు.వి.కృష్ణయ్య తెలిపారు. బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గురువారం ఆస్పత్రి తరలించనున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.