గుంటూరు: తాగుడుకు బానిసై నిత్యం కుటుంబాన్ని వేధిస్తున్న కన్న కొడుకును తండ్రి అతి దారుణంగా హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న వాడు మద్యానికి బానిసై నరకం చూపిస్తుంటే తట్టుకోలేకపోయిన ఆ తండ్రి గత్యంతరం లేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి పాండురంగపేటలో దిద్దులూరు సీతాపతి కుటుంబంతో కలిసి జీవించేవాడు. అయితే అతడి కొడుకు జగదీష్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి వచ్చి నిత్యం కుటుంబాన్ని వేధించేవాడు. అతడి చేష్టలతో ఆ కుటుంబం విసిగిపోయింది. దీంతో కుటుంబపెద్దగా సీతాపతి దారుణ నిర్ణయం తీసుకున్నారు. 

read more  విశాఖ లో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగడం తో మహిళా ఆత్మహత్య

శుక్రవారం ఉదయమే మద్యం సేవించి వచ్చిన జగదీష్ మరోసారి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. దీంతో సీతాపతి కోపోద్రిక్తుడై కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడవడంతో జగదీష్ కు తీవ్ర  రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న  తెనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఆదారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.