భార్యభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ పై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో తండ్రి, చిన్న పాప అక్కడికక్కడే మృత్యువాతపడగా తల్లి, పెద్దకూతురు తీవ్రంగా గాయపడ్డారు. 

అమరావతి: ఆనందంగా జీవిస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. భార్యభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ పై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో తండ్రి, చిన్న పాప అక్కడికక్కడే మృత్యువాతపడగా తల్లి, పెద్దకూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లాలో 65వ నెంబర్, జాతీయ రహదారిపై గల భీమవరం టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ ఒకసారిగా సడన్ బ్రేక్ వేసి ఆగడంతో వెనకున్న బైక్ వేగాన్ని నియంత్రించలేక లారీని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో తండ్రి, చిన్నపాప మృతి చెందారు. 

తల్లి, పెద్దపాపకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన తల్లీ కూతుళ్లను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తండ్రి కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ వైపు నుండి సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.