చంద్రబాబునాయుడు ప్రకటించిన 3వ విడత రైతు రుణమాఫీ అమలు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. రుణమాఫీ అమలు తీరుపై రైతులు మండిపోతున్నారు.
చంద్రబాబునాయుడు ప్రకటించిన 3వ విడత రైతు రుణమాఫీ అమలు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. రుణమాఫీ అమలు తీరుపై రైతులు మండిపోతున్నారు. మూడో విడత మాఫీకి ప్రభుత్వం రూ. 3600 కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబుతో పాటు అనేకమంది మంత్రులు ఇప్పటికే అనేకమార్లు ప్రకటించారు. దీనివల్ల 36.72 లక్షల మంది రైతులు లబ్దిపొందుతారంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ జరుగుతున్నదేంటి?
అయితే చంద్రబాబు చెప్పినట్లుగా రూ. 3600 కోట్లు విడుదల కాలేదు. విడుదలైంది కేవలం రూ. 900 కోట్లు మాత్రమే. మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మరి సిఎం చెప్పినట్లుగా రూ. 3600 కోట్లు ఎందుకు విడుదల కాలేదు? ఎందుకంటే, ఖజానా ఖాళీగా ఉంది. దాదాపు రూ. 7 వేల కోట్ల బిల్లుల చెల్లింపులను ఆర్ధికశాఖ నిలిపేసింది. ఈ దశలో మూడో విడత రైతు రుణమాఫీ అంటే ప్రభుత్వంపై పిడుగుపడినట్లైంది. దాంతో ఏం చేయాలో అర్ధం కాని ప్రభుత్వం ఒకటి చెప్పి మరొకటి చేస్తోంది.

మూడో విడత ప్రక్రియను సిఎం ప్రారంభించి దాదాపు నెలరోజులవుతున్నా లక్షల సంఖ్యలో రైతులకు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా జమ కాకపోవటంతో రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. విచిత్రమైన విషయమేంటే, రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు ఎందుకు జమ కావటం లేదని ప్రభుత్వం బ్యాంకులపై మండిపడుతోంది. బ్యాంకులకు డబ్బులు ఇచ్చి రైతుల ఖాతాలో వేయమంటే వేస్తారు కానీ డబ్బులు ఇవ్వకుండానే రైతుల ఖాతాలో వేయమంటే బ్యాంకులు ఎక్కడి నుండి తెస్తాయి? బ్యాంకుల మేనేజర్లేమైనా వాళ్ళ జేబుల్లో నుండి ఇవ్వాలా ?

అంతేకాకుండా రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతీ జిల్లాలోనూ గ్రీవెన్స్ సెల్లులు ఏర్పాటు చేసింది. దానికి ప్రతీ జిల్లాలోనూ లక్షదాకా ఫిర్యాదులు అందుతున్నాయి. అంటే రుణమాఫీ ఏ స్ధాయిలో అమలవుతోందో అర్ధమైపోతోంది, చాలామంది రైతులు తమకు మొదటి దశ రుణమాఫీ కూడా వర్తించలేదని ఫిర్యాదులు చేస్తున్న రైతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మొత్తం మీద రుణమాఫీ ప్రక్రియ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులను తెస్తోంది.
