అనంతపురంలో విషాదం: పొలానికి వెళ్తున్న రైతుపై పులి దాడి, మృతి
ఉమ్మడి అనంతపురం జిల్లా కామక్కపల్లిలో పొలానికి వెళ్తున్న రైతుపై పులి దాడి చేసింది. ఈ దాడితో రైతు గుండెపోటుతో మృతి చెందాడు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో పొలానికి వెళ్తున్న రైతు రామాంజనేయులుపై పులి దాడి చేసింది. ఒక్కసారిగా పులి దాడి చేయడంతో గుండెపోటుతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో పులి దాడిలో మరణించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఆహారం కోసం అడవి ప్రాంతం నుండి జనావాసాలకు పులులు వస్తున్నాయి. పులులు సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు స్థానికులకు సూచనలు చేస్తున్నారు.
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామంలో రైతుపై పులి దాడి చేసింది.ఈ దాడిలో రైతు సిదాం భీమ్ మృతి చెందాడు.ఈ ఘటన ఈ ఏడాది నవంబర్ 16న జరిగింది. గిరిజన రైతు తన పత్తి చేనులో పనిచేస్తున్న సమయంలో పులి దాడి చేసింది. దీంతో అతను మృతి చెందాడు.
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో పులి దాడిలో రైతు మృతి చెందాడు.కైలాష్ గేడేక్కర్ పై పులి దాడి చేయడంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన కైలాస్ పొలానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. మరునాడు అతని మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. కైలాస్ డెడ్ బాడీని పులి తిన్నట్టుగా పోలీసులు కనుగొన్నారు.
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు బల్లూరు హుండిలో పులి దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తన పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో స్వామి అలియాస్ దాసయ్య పై పులి దాడికి దిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.