గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీఐ వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదును సైతం తప్పుదోవ పట్టించి వేధింపులకు పాల్పడటంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తన ఆత్మహత్యకు ముందు ఆవేదనను ఆ రైతు సెల్ఫీ వీడియో తీశాడు. బసవయ్య అనే రైతు వ్యాపారంలో కొందరు భాగస్వాముల కారణంగా మోసపోయాడు. దీనిపై రైతు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే నిందితులతో కుమ్మక్కైన పట్టాభిపురం సీఐ బత్తుల కళ్యాణ్ రాజ్ కేసును తప్పుదోవపట్టించాడు. పైగా బసవయ్యను వేధించడం ప్రారంభించాడు సీఐ. చివరికి వేధింపులు ఎక్కువ కావడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా ఈ ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. సీఐ కళ్యాణ రాజు పేరు లేకుండా బాధితులపై ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసులు. సీఐ కళ్యాణ రాజుపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్వతహాగా తాను అకౌంటెంట్ కావడం వల్ల కాటన్ బిల్లుల వ్యాపారం బాగుంటుందని నమ్మించి బ్యాంకులో లోన్లతో  పాటు ప్రజల వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చేలా చేసి స్నేహితులే మోసం చేశారని బసవయ్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.