తన సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్ గా లగడపాటి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక లగడపాటి కేవలం సర్వేలకు మాత్రమే పరిమితం అయ్యారు. లగడపాటి చెప్పిన కొన్ని సర్వేలు గతంలో నిజమయ్యాయి. దీనితో ఆయన సర్వేలని అందరూ విశ్వసించడం ప్రారంభించారు. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి పూర్తి భిన్నంగా సర్వే ఇవ్వడంతో విమర్శలకు దారితీసింది. 

ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా లగడపాటి సర్వే తప్పింది. లగడపాటి టిడిపి అధికారంలోకి వస్తుందంటూ చెప్పారు. కానీ వైసిపి 151 సీట్లతో అఖండ విజయం సాధించింది. లగడపాటి సర్వే నమ్మిన ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలువెన్ను గ్రామంలో చోటు చేసుకుంది. కంఠమని వీర్రాజు(45) అనే వ్యక్తి కౌలు రైతుగా పనిచేస్తున్నాడు. అలాగే ధాన్యం వ్యాపారం కూడా చేస్తున్నాడు. 

లగడపాటి టిడిపి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో దాన్ని వీర్రాజు నమ్మాడు. అతడి టిడిపికి అభిమాని కూడా. దీనితో తనకు పరిచయం ఉన్న మిల్లర్ల నుంచి 12 లక్షలు అప్పు తెచ్చి టీడీపీ విజయం సాధిస్తుందంటూ పందెం కాశాడు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. వైసిపి విజయం సాధించింది. దీనితో అప్పు ఎలా తీర్చాలో తెలియక తమ గ్రామంలోని గుడి వెనుక భాగంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ సంఘటన వేలువెన్ను గ్రామ ప్రజలని విషాదంలోకి నెట్టింది. వీర్రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో అతడి భార్య బోరున విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.