Asianet News TeluguAsianet News Telugu

బతికుండటం వల్లే సీఎం అయ్యా, రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చింది : కిరణ్‌కుమార్‌ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో పాటు తాను ఆ రోజు విమానంలో వెళ్లాల్సి ఉండే అని.. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయ్యిందని.. అలా బతికుండడం వల్లే తాను సీఎం అయ్యానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

farmer cm kiran kumar reddy comments about three capitals in unstoppable show
Author
First Published Nov 26, 2022, 8:32 AM IST

హైదరాబాద్‌ : బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సందడి చేశారు. మూడు రాజధానుల విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమ వేదికగా నటుడు నందమూరి బాలకృష్ణ ఆ ప్రస్తావన తీసుకురాగా కిరణ్‌కుమార్‌ సమాధానమిచ్చారు. ‘‘అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ అంటే కేబినెట్‌, సెక్రటేరియట్‌కు సంబంధించివారు. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి, వాళ్ల సూచన మేరకు కోర్టులో ఏం ఫైల్‌ చేయాలో అనుమతులు తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మూడూ కలిసి ఉంటేనే అనుకూలంగా ఉంటుంది’’ అని అన్నారు. 

farmer cm kiran kumar reddy comments about three capitals in unstoppable show

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు కిరణ్‌కుమార్‌తోపాటు రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి, నటి రాధిక హాజరై, పలు విశేషాలు పంచుకున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో వస్తున్న షో అన్ స్టాపబుల్. ఇది రెండో సీజన్ ఇటీవలే ప్రారంభమయ్యింది. సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సందడి చేశారు. దీంతో తరువాతి ఎపిసోడ్స్ లో వచ్చే గెస్ట్ ల మీద ఈ షో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డిల ఈ మూడో ఎపిసోడ్ కు హాజరయ్యారు.

కేసీఆర్ కు కీడు తలపెట్టే ఆలోచన కలలో కూడా లేదు.. రఘురామకృష్ణంరాజు

నేను బతికుండటం వల్లే సీఎం అయ్యా : కిరణ్‌కుమార్‌ రెడ్డి
ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు చేసిన తర్వాత చీఫ్‌ విప్‌ అయి, తర్వాత స్పీకర్‌ అయ్యాను. బతికున్నాను కాబట్టి అప్పుడు సీఎం అయ్యాను. బతికుండటం వల్లే రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డిగారు వెళ్లే హెలికాఫ్టర్‌లో నేనూ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ ముగిసే చివరి క్షణాల్లో రాజశేఖర్‌రెడ్డి నాకు ఫోన్‌ చేశారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ఎవరిని ఎంపిక చేస్తున్నావ్‌? అని అడిగారు. నాగం జనార్థన్‌రెడ్డి పేరుని ప్రతిపక్ష నాయకుడు సూచించారని చెప్పాను. 

‘శోభానాగిరెడ్డి’ని తీసుకోండి అని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అకౌంట్స్‌ కమిటీ సహా మూడు కమిటీలను పెండింగ్‌లో పెడతానని, చర్చించుకున్న తర్వాత వివరాలు ప్రకటిస్తానని చెప్పా. మరుసటి రోజు ఆ అనౌన్స్‌మెంట్‌ ఉండటంతో ఆయనతో హెలికాఫ్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకొన్నాను. నేను కార్యాలయంలో ఉండగా నాకు ఫోన్‌ వచ్చింది. ‘ఎక్కడున్నారు మీరు?.. రాజశేఖర్‌రెడ్డిగారు రాలేదా’ అని ప్రశ్నించారు. ఎప్పుడో బయలుదేరారు కదా అనుకుని నేనే అక్కడి ఆఫీసుకు ఫోన్‌ చేసి సీఎంగారు ఇంకా చేరలేదట..ఏమైందో తెలుసుకోండి అని చెప్పాను’’ అంటూ ఆ రోజులు గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ ‘‘మా నాన్న పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతే బాధపడ్డా. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. ప్రస్తుతం ఉంటోంది హైదరాబాద్‌లోనే. రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే నా కోరిక. ఇప్పుడు విచారించాల్సిన అవసరంలేదు. అంతా సవ్యంగానే ఉంది’’ అని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన బాలకృష్ణ కు కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన సమాధానమిది! బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సందడి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios