అమరావతి: కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఓ సన్సేషన్. గుడివాడ రాజకీయంలో ఆయన ఒక సంచలనం. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 20 ఏళ్లుగా గుడివాడ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడు కొడాలి నాని. వైయస్ జగన్ అడిగితే ప్రాణమిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జగన్ కోసం ఎక్కడికైనా వెళ్తా ఎందాకైనా వెళ్తానంటూ వార్తల్లో నిలిచారు కొడాలి నాని. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడులలో ఒకరైన కొడాలి నానికి జగన్ మంత్రి పదవి ఇచ్చి తన కేబినెట్ లో ఆహ్వానించారు. 

కొడాలి నాని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. దివంగత సీఎం ఎన్టీఆర్ కు పిచ్చి అభిమాని. అంతేకాదు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణను తన రాజకీయ గురువుగా చెప్తుంటారు కొడాలి నాని. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇప్పటికీ తాను ఎన్టీఆర్ వీరాభిమానిని అని, తన రాజకీయ గురువు నందమూరి హరికృష్ణ అంటూ చెప్తూనే ఉంటారు. 2004లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. 

2009లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగానే ఉంటూ గుడివాడ సమస్యల కోసం పార్టీలోనే గళమెత్తాడు. గుడివాడ స‌మ‌స్య‌ల కోసం హైద‌రాబాద్‌కు పాద‌యాత్ర చేసిన ఏకైక వ్యక్తి. 

2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైయస్  జగన్ వెంట నడిచారు. వైయస్ జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు సైతం పడింది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అసెంబ్లీలోపలా బయట చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించారు. ఎన్నికల ప్రచారంలో గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

తనదగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడంపై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు వ్యూహాలు రచించినప్పటికీ ఆయన వ్యూహాల ముందు అవన్నీ ఫెయిల్ అయ్యాయి. 

దమ్ముంటే నన్ను ఓడించు అంటూ సవాల్ విసిరిన కొడాలి నాని తానేంటో నిరూపించుకున్నారు. ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకున్న ఆయన పార్టీ పట్ల విధేయతతో జగన్ కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు.