కర్నూలు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పందించారు. మైనారిటీలపై కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోమవారంనాడు ఆయన నంద్యాలకు వెళ్లారు. 

మైనారిటీలపై అన్యాయంగా కేసులు పెడుుతన్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. హమీలను గుర్తు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన నంద్యాల ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టిన ఘనత గత టీడీపి ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఆయన అన్నారు.

నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టులు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. కేసులో లోతైన విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆత్మహత్య కేసులో ఐపిఎస్ అధికారులతో ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని ఆయన అన్నారు. 

విచారణ పారదర్శకంగా జరుగుతుందని ఆయన అన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసును ఎక్కడ, ఎవరికి లొంగని నిజాయితీపరుడైన అధికారితో విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.

నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల హింసలు భరించలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను తెలిపాడు. 

అబ్దుల్ సలాం (45), ఆయన భార్య నూర్జహాన్ (38), కూతురు సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్ (10) పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సీఐ సోమశెఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ను పోలీసులు అరెస్టు చేశారు