ఏలూరు ప్రజలు గతకొద్ది రోజులుగా వింత వ్యాధికి గురయి వందలసంఖ్యలో ఆస్పత్రిపాలవుతున్న విషయం తెలిసిందే. ఇలా అనారోగ్యానికి గురయిన వారిలో కొందరు మరణించారు. దీంతో మరింత ప్రాణనష్టం జరక్కుండా చూసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోని వివిధ ఆరోగ్యసంస్థలు రంగంలోకి దిగాయి. అయితే అవి కూడా ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటనపై చర్చించేందుకు వైద్య బృందాలు సమీక్షా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశం అనంతరం కూడా ప్రజల అనారోగ్యంపై స్పష్టత రాలేదని కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. 
 
''రక్త నమూనాల్లో లెడ్, నికెల్ మోతాదుకు మించి ఉంది. ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నీటిలో ఎలాంటి కాలుష్యం లేదు. గాలి లో కూడా ఎక్కడా లెడ్, నికెల్ మోతాదుకు మించి లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది'' అన్నారు. 

''ధాన్యంలో పాదరసం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. ఫిట్స్ వచ్చిన వాళ్లలో 80 శాతం మంది మాంసాహారం తీసుకోలేదు. చేపలు, మాంసాహారాలపై ఇంకా పరిశోధన జరుగుతోంది.నగరవాసుల అనారోగ్యానికి ఎటువంటి వైరస్, బాక్టీరియా కూడా కారణం కాదని తెలుస్తోంది. ఆహారంపై మాత్రమే అనుమానాలు మిగిలాయి. ఫెస్టిసైడ్స్, పంటల పై పరిశోధనల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. త్రాగునీటి గురించి ఎలాంటి అపోహలు అక్కర్లేదు'' అని కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించారు.