పెళ్లి కాకున్న అయినట్లు, భర్తలతో కలిసుంటూనే విడాకులు తీసుకున్నట్లు నకిలీ సర్టిపికెట్లు సృష్టించి ప్రభుత్వ పథకాలను పొందుతున్న సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ అడ్డంగా బుక్కయ్యారు.
అనకాపల్లి : వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్, సచివాలయల వ్యవస్థలపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి,జనసేన పార్టీలు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాల కోసం కొందరు సచివాలయ ఉద్యోగులు అడ్డదారులు తొక్కారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ పథకాలను పొందుతూ సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించి ఓ వాలంటీర్ అడ్డంగా బుక్కయ్యారు.
వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలో గ్రామ సచివాలయం వుంది. ఇందులో డిజిటల్ సహాయకుడిగా సుధీర్, మహిళా పోలీసులుగా బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి పనిచేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులు కాకున్నా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు. అవివాహితుడైన సుధీర్ డిజిటల్ కీ ఉపయోగించిన పెళ్లియనట్లు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు. అలాగే పెళ్లయి భర్తలతో కలిసివుంటున్న రాజేశ్వరి, వెంకటలక్ష్మి విడాకులు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు తయారుచేసుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో పథకాలను పొందుతూ ఏకంగా ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించారు ముగ్గురు ఉద్యోగులు.
నకిలీ పత్రాలతో సచివాలయ ఉద్యోగులు అక్రమంగా ప్రభుత్వ పథకాలను పొందేందుకు వాలంటీర్ చొక్కాకుల నానాజీ సహకరించాడు. అయితే ఈ ఘరానా మోసాన్ని దిబ్బపాలెంకు చెందిన మరో ఉద్యోగి భయటపెట్టాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ స్థానిక పంచాయితీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Read More వృద్దుల పించన్ డబ్బులతో జూదమాడి... అడ్డంగా బుక్కయిన వాలంటీర్
పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదుతో దిబ్బపాలెం సచివాలయ ఉద్యోగులు ముగ్గురితో పాటు వాలంటీర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ పై విడుదలచేసారు.
