వివాహితతో యువకుడి ప్రేమ.. ముగ్గురు ప్రాణాలను తీసింది

facebook love kills three people in godaveri district
Highlights

 వివాహిత భర్తకు వెంకటేష్‌ ఫోన్‌ చేసి ‘నీ భార్య నేను పెళ్లి చేసుకుంటామని, ఆమెను వదిలివేయాలని’ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త గత నెలలో రాజమహేంద్రవరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఓ ప్రేమ.. దంపతులను వేరే చేయడం తోపాటు.. ముగ్గురు ప్రాణాలను బలిగొంది. చివరకు మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జంగారెడ్డిగూడెం పోలీస్‌ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్‌ కంపా వెంకటరమణ కుమారుడు కంపా వెంకటేష్‌ (23) క్వార్టర్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కంపా వెంకటేష్‌కు ఫేస్‌బుక్‌లో తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వాంబే కాలనీకి చెందిన ఓ వివాహితతో పరిచయమైంది. ఆమె రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువు వద్ద ఒక బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

ఆ తరువాత కంపా వెంకటేష్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. వివాహిత అమ్మమ్మది జంగారెడ్డిగూడెం కావడంతో వెంకటేష్‌కు, వివాహితకు మధ్య స్నేహం పెరిగింది. దీంతో వెంకటేష్‌ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వివాహిత భర్తకు వెంకటేష్‌ ఫోన్‌ చేసి ‘నీ భార్య నేను పెళ్లి చేసుకుంటామని, ఆమెను వదిలివేయాలని’ చెప్పాడు.

దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త గత నెలలో రాజమహేంద్రవరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వివాహిత వెంకటేష్‌కు ఫోన్‌ చేసి తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నువ్వే కారణమని చెప్పి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్‌కు తెలిపింది. గత నెలలో వివాహిత జంగారెడ్డి గూడెం వచ్చింది. 

తర్వాత వెంకటేష్‌ వివాహితను తన స్కూటీపై ఎక్కించుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో వివాహిత కొవ్వూరు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అప్పట్లో కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్‌ను విచారించారు. అప్పటి నుంచి అన్యమనస్కుడైన వెంకటేష్‌ చివరికి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అల్లు దుర్గారావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader