Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడే ఆమె పాలిట మృత్యువయ్యాడు

 వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మాట్లాడాలని పిలిచిన ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బండరాయితో తలపై మోది అత్యంత కిరాతకంగా అంతమెుందించాడు. ప్రియురాలిని చంపిన నేరానికి కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు ఆ దుర్మార్గుడు. 

extramarital affair women murder in nellore
Author
Nellore, First Published Oct 20, 2018, 3:22 PM IST

నెల్లూరు: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మాట్లాడాలని పిలిచిన ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బండరాయితో తలపై మోది అత్యంత కిరాతకంగా అంతమెుందించాడు. ప్రియురాలిని చంపిన నేరానికి కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు ఆ దుర్మార్గుడు. 

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని చింతచెట్టు సెంటర్‌కు చెందిన రజియా అలియాస్‌ పోలమ్మ (22)ను ఆమె ప్రియుడు పూజారి రాంబాబు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికంటపడనియ్యకుండా యాతలూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. రజియా కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడు రాంబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులు రాంబాబును తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

చింతచెట్టు ప్రాంతానికి చెందిన రజియా, శ్రీకాళహస్తి మండలం చింతపూడికి చెందిన వెంకటేశ్వర్లు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు.
వెంకటేశ్వర్లు జీవనోపాధి నిమిత్తం సూళ్లూరుపేటలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అయితే ఈ నెల 11న సబ్బు తీసుకువస్తానని దుకాణానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి బయటకు వెళ్లిన రజియా కనిపించకుండా పోయింది. 

రజియా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇంటికి వెళ్లిందా అని ఆరా కూడా తీశారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి మస్తానమ్మ తన కుమార్తె కనిపించడం లేదంటూ ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పూజారి రాంబాబుపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 

కేసు నమోదు చేసిన పోలీసులు రాంబాబు కోసం ఆరా తీశారు. అప్పటికే రాంబాబు పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో రాంబాబు స్థానిక వీఆర్వోతో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా రజియాను తానే హత్య చేసినట్లు రాంబాబు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

రజియాతో తనకు 10ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అయితే వివాహం చేసుకున్న తర్వాత తనతో సరిగ్గా ఉండటం లేదని దాంతో ఈనెల 11న మాట్లాడాలని పిలిచినట్లు పోలీసులకు వివరించాడు. యాతలూరు అటవీప్రాంతానికి రజియాను తీసుకెళ్లానని అయితే అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆగ్రహంతో పక్కనే ఉన్న రాయితో రజియా ముఖంపై కొట్టినట్లు తెలిపాడు. దాంతో రజియా మృతిచెందిందని మృతదేహాన్ని సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. 

నిందితుడు రాంబాబును తీసుకుని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై, తహాశీల్ధార్ లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాంబాబును పోలీసులు కోర్టుకు హజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios