''వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను''
వైసిపి నాయకులు, కార్యకర్తలంతా 2019 లో అంటే సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదేరోజున సంబరాల్లో మునిగిపోయారు. తమ అభిమాన నాయకుడు 'వైఎస్ జగన్ అనే నేను' అంటూ ప్రమాణస్వీకారం చేస్తుంటే పులకించిపోయారు. ఇక ఈసారి...
అమరావతి : సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజు ఆంధ్ర ప్రదేశ్ లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది ఈ రోజునే. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ జనసందోహం సమక్షంలో ''వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను'' అంటూ ప్రమాణం స్వీకారం చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ జగన్. ఆ రోజు ఆయన కళ్లలో ఆనందం, వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.
వైఎస్ జగన్ పొలిటికల్ కెరీర్ :
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి చివరకు జైలు జీవితం కూడా గడిపాడు. అవినీతి కేసులు, రాజకీయ కక్షసాధింపులు... ఇలా అన్నింటిని ధైర్యంగా ఎదిరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నాడు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమిని చవిచూసాడు జగన్. దీంతో మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.
అయితే వైఎస్ జగన్ ప్రతిపక్షంలో వుండగా బాగా రాటుదేలాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఆనాటి అధికార టిడిపి ఎంతలా అణగదొక్కాలని ప్రయత్నించినా కెరటంలా పైపైకి లేచాడు. తన తండ్రి సక్సెస్ ఫార్ములా పాదయాత్రను ఉపయోగించి ఎట్టకేలకు అధికారాన్ని చేజిక్కించుకున్నారు వైఎస్ జగన్.
రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు వైఎస్ జగన్. ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యలను పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. ఇలా నిత్యం ప్రజలమధ్యే వుంటూ
తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరాడు. దీంతో ప్రజలు కూడా ఆయనపై నమ్మకంతో 2019 ఎన్నికల్లో వైసిపిని బంపర్ మెజారిటీతో గెలిపించారు. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 151 స్థానాల్లో వైసిపి గెలిచింది. 25 లోక్ సభ స్థానాల్లో 22 వైసిపి ఖాతాలో చేరిపోయాయి. దీంతో తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి ఐదేళ్ల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పాలన సాగింది.
మరోసారి 'జగన్ అనే నేను' అంటారు : వైసిపి ధీమా
గత ఐదేళ్లు అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాలే వైసిపిని మళ్లీ గెలిపిస్తాయని ... వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని రెండోసారి సీఎంను చేస్తాయని వైసిపి శ్రేణులు ధీమాతో వున్నాయి. వైసిపి అయితే గత ఎన్నికల కంటే మెజారిటీ పెంచుకోవాలని...175 కు 175 సీట్లలో గెలుపే లక్ష్యమంటూ బరిలోకి దిగింది. పోలింగ్ తర్వాత కూడా గెలుపుపై ధీమాతో వున్న వైసిపి ఈసారి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం విశాఖపట్నంలో వుంటుందని ప్రకటించింది.
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున (మే 30) 'జగన్ అనే నేను' అంటూ ప్రమాణస్వీకారం సీన్ త్వరలోనే విశాఖలో రిపీట్ అవుతుందని వైసపి శ్రేణులు చెబుతున్నారు. మరో ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించేది వైసిపి ప్రభుత్వమే... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని వైసిపి నాయకులు బలగుద్ది చెబుతున్నారు. మరి జూన్ 4న ఎలాంటి ఫలితం వెలువడుతోంది చూడాలి.