వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు ఆయన కుమారుడు మణికంఠ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రైల్వే గేట్ వద్ద ఓ లారీ వెనక్కి దూసుకువచ్చి మక్కెన కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కారు ముందు భాగం దెబ్బతింది.
వినుకొండ (vinukonda) మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావుకి (makkena mallikarjuna rao) పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం తన సొంత గ్రామం అయిన కొటప్ప నగర్‌లో వ్యవసాయ పనులు పరిశీలించడానికి కుమారుడు డాక్టర్ మక్కెన మణికంఠతో కలిసి మల్లిఖార్జున రావు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగు పాలెం వద్ద రైల్వే గేటు పడటంతో ఓ లారీ ముందుకు వెళ్లలేకపోయింది. ఆపై వెనుకే ఆగివున్న మక్కెన కారుని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మక్కెన కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు తండ్రి కొడుకులు. ఇదే సమయంలో లారీ- కారు మధ్యలో వచ్చిన బైకు లారీ చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలక పోవడంతో మక్కెన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
