కర్నూలు: తెలుగుదేశం పార్టీలో చేరతానని తాను ఏనాడు చెప్పలేదని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తులపై కాంగ్రెస్‌ నిర్ణయం నచ్చలేదని కోట్ల చెప్పుకొచ్చారు.

ఒకరు పోతే వందమందిని తయారు చేసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచెయ్యాలని హితవు పలికారు. నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని కోట్ల తెలిపారు. సీఎం చంద్రబాబు తనకు మంచి మిత్రుడని కోట్ల స్పష్టం చేశారు. 

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని సీఎంను కలిసి విన్నవించినట్లు తెలిపారు. కార్యకర్తలను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోనన్నారు. టీడీపీలోకి వెళ్తే విజయభాస్కర్ రెడ్డి ఆత్మ ఎందుకు క్షోభిస్తుందని చెప్పాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. 

తన తండ్రి ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని, తమ కుటుంబం ఏం చేసినా ధైర్యంగా చేస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై తన రాజకీయభవిష్యత్ పై ప్రకటన చేస్తానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.