ఉద్యోగుల జీతాలకు, కరోనా  ఉపశమన- సహాయ చర్యలకు నిధులు విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి ఆదేశాలు ఇవ్వడం హేయమన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.

కేంద్ర ప్రభుత్వ నిధులు, డివల్యూషన్ కింద రావాల్సిన సొమ్ము, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ , కోవిడ్ 19 ఉపశమన నిధులు, 14 వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది పుష్కలంగా వచ్చాయి.. అయితే వీటన్నింటినీ ట్రెజరీ స్థాయిలోనే నిలిపేయడం దారుణమని యనమల మండిపడ్డారు.

ఈ మేరకు రామకృష్ణుడు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కరోనా కిట్లకు, మాస్క్ లు, పిపిఈలకు, వైద్యం, పారిశుద్య పనులకు నిధులు అత్యవసరంగా కావాల్సివున్నప్పటికీ, ఈ నిధులను విడుదల చేయకుండా స్థంభింపచేయడాన్ని గర్హిస్తున్నామన్నారు.

దీనితో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతర వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా నిధులు విడుదల చేయవద్దని చెప్పిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని రామకృష్ణుడు ప్రశ్నించారు.

జలకు నిత్యావసర సరుకుల పంపిణీలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజలు విరాళంగా ఇచ్చిన నిధులే ఖర్చు చేయాలని స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు దీనిని బట్టి కనిపిస్తోందని యనమల అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులను తామే ఇచ్చినట్లుగా గొప్పలు చెబుతున్నారని..  వలస కార్మికుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలలో, దేశాల్లో చిక్కుకు పోయిన తెలుగువారిని రాష్ట్రానికి రప్పించడంపై జగన్ ప్రభుత్వం శ్రద్ద పెట్టడం లేదని యనమల ఆరోపించారు.

వివిధ ప్రాంతాల్లో వేలాది మంది తెలుగువారు పస్తులు ఉంటున్నా వైసిపి ప్రభుత్వంలో చలనం లేకపోవడం గర్హనీయమన్నారు. కోవిడ్ 19వైరస్ తీవ్రతను సీఎం జగన్ తక్కువగా చూపాలని ప్రయత్నిస్తున్నారని.. ఎన్నికలపైనే ప్రధాన దృష్టిపెట్టి ఏదోవిధంగా చట్టవిరుద్ద చర్యల ద్వారా వాటిని నాశనం చేయాలని చూస్తున్నారని రామకృష్ణుడు ఆరోపించారు.

జగన్ మార్గదర్శకాల ప్రకారమే వైసిపి నాయకులు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా కరోనా పరిస్థితులను కూడా రాజకీయలాభాల కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాబడులు, అప్పులు,కరోనా ఉపశమన నిధులు ఎంత వచ్చిందీ వెల్లడించాలి యనమల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్రంలో టెలిమెడిసిన్ ను ప్రారంభించిందే టిడిపి ప్రభుత్వం అయితే దానికి వైఎస్సార్ టెలిమెడిసిన్ పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మన రాష్ట్రంలో ‘‘కరోనా 19’’ పేరును కూడా ‘‘వైఎస్సార్ కరోనా’’ అని, లేదా ‘‘జగన్ కరోనా’’ గా పేరు పెట్టాలని యనమల సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతలు తన పార్టీ, తన అనుచరులే..అంతే తప్ప రాష్ట్రంలో పేదలు, రైతులు, కార్మిక సంక్షేమం ఆయనకు ముఖ్యం కాదన్నారు.

ఇంగ్లీషు మీడియంను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రామకృష్ణుడు స్పష్టం చేశారు.