మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్న అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
విజయవాడ: మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్న అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
నాదెండ్ల మనోహర్ నాకు అన్నలాంటి వారని పవన్ చెప్పారు. బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి మనోహర్ అంటూ పవన్ కొనియాడారు. మరోవైపు ఇకపై జనసైనికుడిగా పనిచేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ ఆలోచన, సామాజిక స్పృహ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. పవన్ కళ్యాణ్ భావాలు తన భావాలు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజులుగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. ఇద్దరూ కలిసే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నాదెండ్ల మనోహర్ రాకతో జనసేన పార్టీ నాయకులు జోష్ మీద ఉన్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి పార్టీలోకి రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు తనయుడు మనోహర్. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా వ్యవహరించారు.
తన తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏఐసీసీలో స్థానం లభించకపోవడంతో ఆయన అలకబూనారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పడిన రాహుల్ టీంలో తనను ఆహ్వానించకపోవడంపై నాదెండ్ల మనోహర్ అలక బూనారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ బరిలో ఉండే అవకాశం కనబడుతోంది. తెనాలి సీటుపై కాంగ్రెస్ పార్టీలో ఉండగానే కన్నేసిన నాదెండ్ల అయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఏర్పడితే తనకు సీటు వస్తుందా అన్న అనుమానంతో ఉండేవారు. అటు వైసీపీలో కూడా తెనాలి సీటుకు భారీ పోటీ ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో బరిలో నిలవడం ఖాయం అనిపిస్తోంది.
