విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుపై కుట్రలను బట్టబయలు చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆర్కే బీచ్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.  

విగ్రహాల తొలగింపుపై ఓ మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు బీచ్‌ రోడ్‌లోని విగ్రహాలను తొలగించారని స్పష్టం చేశారు.  విగ్రహాల ఏర్పాటుపై కోర్టులో కేసు విచారణలో ఉండగా తొలగించడం దారుణమన్నారు. 

రాజకీయ అక్కసుతోనే చంద్రబాబు ఆ విగ్రహాలను తొలగించారన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్, జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడం, అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున వైఎస్ జగన్ ను కలవడం జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈ కుట్రకు పూనుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారంటూ ధ్వజమెత్తారు. త్వరలో ఏపీలో రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్‌ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని మళ్లీ జగన్‌ సీఎం అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. 

దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించారని మండిపడ్డారు. బీచ్‌ రోడ్‌లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖుకల విగ్రహాలు ఉన్నాయన్నారు. 

వాటికి కూడా ఎలాంటి అనుమతులు లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలు తానే ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. వాటన్నింటిని వదిలేసి దాసరి, ఏఎన్ఆర్, హరికృష్ణ విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.