రాజకీయాల పరంగా మీలో మీరు కొట్టుకు చచ్చినా రాష్ట్రం కోసం కలిసి పోరాడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ విభజన, ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలపై ఉండవల్లి విజయవాడలోని ఐలాపురం హోటల్‌‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ...జనవరి 30, 2014న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందన్నారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ శాసనసభ్యులు 9,072 సవరణలు చేసి క్వింటాళ్ పేపర్లను లోక్‌సభకు పంపారని ఉండవల్లి గుర్తు చేశారు.

వాటన్నింటిని ఏమాత్రం పట్టించుకోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గంటలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు. విభజన చట్టం అమలు విషయంలో,  ఆర్ధికపరమైన అంశాల్లో టీడీపీ, బీజేపీలకు స్వల్ప విభేదాలున్నాయన్నారు.

బీజేపీనీ, కాంగ్రెస్‌ను తప్పుబట్టడం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశ్యం కాదన్నారు. భారత్‌లో ఏం జరిగినా అంతా రాజ్యాంబద్ధంగా జరగాలన్నారు. రాష్ట్రాలను విభజించే అంశంపై రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో స్పష్టంగా వివరించారన్నారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అది సరిగా అనుసరించలేదని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిందేదో జరిగిపోయిందని ఇక నుంచి జరిగేదైనా రాజ్యాంగం ప్రకారం జరగాలని ఆయన కోరారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఈ సమావేశానికి హాజరవ్వడంతో ఆయన గ్లామర్ పెరిగిందని ఉండవల్లి చమత్కరించారు.

కనీసం మనకు జరిగిన అన్యాయాన్ని దేశం గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో ఏ పార్టీలు ఎన్ని అనుకున్నా రాష్ట్రం విషయంలో మాత్రం అందరూ ఒక్క మాటపై ఉండాలని అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఆంధ్రా వాళ్లంటే కోటీశ్వరులు, వ్యాపారులేనని వారికి రాష్ట్రం అవసరం లేదని ఢిల్లీలో అంటుంటారని ఉండవల్లి తెలిపారు. పార్టీలు వేరైనా టైం వస్తే ఆంధ్రులు ఒక్కటేనన్న భావన ఉత్తరాది వారికి కలిగించాలన్నారు.