Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా.. చంద్రబాబు ఫోటోను నేలకొసి కొట్టి, లోకేష్‌ని గెలవనివ్వనని సవాల్

 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు .. రాయపాటి రంగారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.  టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని..  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఆరోపించారు.

ex mp rayapati sambasiva rao son rayapati rangarao resigns to tdp ksp
Author
First Published Jan 12, 2024, 9:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ రెండింట్లోనూ ఇదే పరిస్ధితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని రాజీనామా చేయగా.. ఇప్పుడు పక్కనే వున్న గుంటూరు నుంచి ఆ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు .. రాయపాటి రంగారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీతో పోస్ట్‌తో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీలో పనిచేయలేనని రంగారావు పేర్కొన్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని..  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఆరోపించారు. మా దగ్గర రూ.150 కోట్లు తీసుకుని ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని రంగారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వంటి ప్రత్యేక పరిస్ధితుల్లో నాన్న గారు పోటీ చేయాల్సి వచ్చిందని.. కులం పేరుతో పార్టీలో ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు నాయకుల వద్ద డబ్బు వసూళ్ల కార్యక్రమం చేస్తున్నారని రంగారావు ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ కారణంగా తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, వైసీపీ ఆహ్వానిస్తే ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. మంగళగిరిలో నారా లోకేష్ ఎలా గెలుస్తారో చూస్తానని రంగారావు సవాల్ విసిరారు. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో మా కుటుంబానికి మంచి పేరు వుందని.. తనకు ఎక్కడి నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని వెల్లడించారు. కియా కంపెనీని తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, మరి రాయలసీమలో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని రంగారావు ప్రశ్నించారు. తాను సత్తెనపల్లి సీటును ఆశించానని, కానీ ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లుగా కనీసం తమకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios