తలలేని రాజధానితో ప్రజలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని జేసీ కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అధికారులపై కోపం లేదని.. కొందరి వ్యవహారశైలే అభ్యంతరకరంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీలో తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని.. ఆ క్రమంలోనే అనంతపురం వచ్చిన సత్యకుమార్, కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన స్పష్టం చేశారు.

ఐదు కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని.. ఒకవేళ రాజధాని మారిస్తే రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతం, గ్రేటర్ రాయలసీమ చేయాలని జేసీ డిమాండ్ చేశారు.

Also Read:మోడీకి జై కొట్టాల్సిందే.. కానీ టీడీపీలోనే ఉంటా: అంతుచిక్కని జేసీ అంతర్యం

ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయాలను తీసుకుంటానని దివాకర్ రెడ్డి వెల్లడించారు. మానసికంగా, ఆర్ధికంగా కొంతమంది తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకూ తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గిపోతోందని.. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.

కొన్ని విషయాల్లో మోడీకి జై కొట్టాల్సిందేనన్న జేసీ.. ఆర్టికల్ 370ను రద్దును సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కనుమరుగువుతాయని దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.

Also Read:తినలేదు, మందులు వేసుకోలేదని చెప్పినా వినలేదు: జేసీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 6గంటల తర్వాత అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ నుంచి జేసీ బెయిల్ మీద విడుదలయ్యారు. 

ఆ తర్వాత జేసీ మీడియాతో మాట్లాడారు. కోర్టు బెయిల్ తో పోలీసు స్టేషన్ కు వెళ్తే పోలీసులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా అక్రమంగా తనను పోలీసు స్టేషన్ లో నిర్బంధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తనకు బీపీ, షుగర్ ఉందని చెప్పినా పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పారు. భోజనం చేయలేదు, మందులు వేసుకోలేదని చెప్పినా వినలేదని ఆయన చెప్పారు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని జేసీ అన్నారు.