విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్. ఆంధ్రప్రదేశ్‌కు, భారతదేశానికి మీ నాన్న ఏం చేశాడని వైఎస్ పేరు పెట్టావని జగన్‌ను ఆయన ప్రశ్నించారు. 

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలే పేర్లలో ఏముందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గొప్పనటుడు, మంచి లీడర్ అని విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని చింతా మోహన్ అన్నారు. అసలు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడందేనికి బంగారూ... పేరు మార్చడం వల్ల వైద్య సౌకర్యాలు ఏమైనా మారయా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ భారతదేశానికి, ఏపీకి చేసిన త్యాగాలు ఏమైనా వున్నాయా.. మీ నాన్న పేరు పెట్టుకోవడం ఎందుకు , ఆయనేమైనా కష్టపడి డాక్టర్ చదివాడా అని చింతా మోహన్ ప్రశ్నించారు. 

తమిళనాడులోనూ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వుందని.. కరుణానిధి సీఎం కాగానే ఎంజీఆర్ పేరు తీసేయ్యలేదని, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంజీఆర్ పేరు తీసి తన తండ్రి పేరు పెట్టలేదని చింతా మోహన్ గుర్తుచేశారు. ఈ మూడేళ్లలో వైసీపీ చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. నిద్రపోతున్న జర్నలిస్ట్ అంకబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని చింతా మోహన్ ప్రశ్నించారు. చేతిలో పోలీసులు వున్నారు కదా అని మాట్లాడేవాళ్లందరినీ అరెస్ట్ చేయిస్తున్నావు.. రేపు నీ పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

ALso REad:మార్చెయ్యటానికీ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..: నందమూరి బాలకృష్ణ హెచ్చరిక

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు. వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు.