కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు వరకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. 

అదికూడా ఆయన సొంత జిల్లా కడపలో. అంతేకాదు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేత కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీలో చేరిన మెదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 

2019 ఎన్నికల్లో వీరశివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోవడంతో వీరశివారెడ్డి పార్టీపై అలిగారు. కొద్దిరోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశచూపించారు. 

దీంతో ఆయన తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిల సమక్షంలో వీరశివారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్రబాబుపై వ్యతిరేకతను ప్రజలు బయటపెట్టారని, చంద్ర‌బాబును ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో తిర‌స్క‌రించార‌ని వీరశివారెడ్డి చెప్పుకొచ్చారు. 

వైఎస్ జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌తలు చేప‌డతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎం కావడంతో రాజన్న రాజ్యం మళ్లీ రావడం ఖాయమని వీరశివారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వానికి వీరశివారెడ్డి బోణీ కొట్టారన్నమాట.