మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతిచెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతిచెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ రాజు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు.
గతంలో చంద్రశేఖర్ రాజు కాంగ్రెస్ తరఫున 1989-94 వరకు పాతనాగూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణికి చంద్రశేఖర్ రాజు స్వయాన మామ. చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్‌రాజును పుష్పశ్రీ వాణి వివాహం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు చంద్రశేఖర్ రాజు సోదరుడు.
అయితే కొంతకాలంగా పుష్ప శ్రీవాణికి, ఆమె మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజుకు రాజకీయంగా పడడం లేదు. పుష్పశ్రీ వాణిపై, వైసీపీ ప్రభుత్వంపై శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు, పుష్ప శ్రీవాణి ఆడపడచు పల్లవి కూడా టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతిపట్ల నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.
