తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఆకర్ష్ మంత్ర వేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు నేతలు బీజేపీలో చేరగా.. ఇప్పుడు ఏపీలో అదే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా.. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి షాకిచ్చారు. 

అధికార పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీరజారెడ్డి చేరికతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బీజేపీ మరింత బలోపేతమవుతుందన్నారు బీజేపీ నేతలు. జిల్లాలో పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని నీరజారెడ్డి అన్నారు.


నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. మళ్లీ 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు.