కడప: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయంటూ వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఖండించారు. వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. 

రాజంపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజంపేటలో కొంతమంది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని  ఆరోపించారు. రాజంపేట ప్రజలు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోరని మంచిని ప్రోత్సహిస్తారని బ్లాక్ మెయిల్ చేసే రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. 

వైసీపీ సీనియర్ నేత, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాను వర్గాలను ప్రోత్సహించనని అందరినీ కలుపుకుపోవడమే తన ధ్యేయమన్నారు. 

రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలకు అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. అభ్యర్థులు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. 

ఇకపోతే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ వీడిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజంపేట అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడుని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

రాజంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆ ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు భత్యాల చెంగలరాయుడును తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని దరి చేర్చుకోవాలన్న చంద్రబాబు ప్లాన్ లో ఒక భాగంగానే చెంగలరాయుడును ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఇకపోతే చెంగలరాయుడు చంద్రబాబుకు చిన్న నాటి స్నేహితుడు కావడం విశేషం. ఇంత జరిగినా అభ్యర్థులు కరువు అంటూ మేడా మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.