అమరావతి: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి కమలను సాదరంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు. కాండ్రు కమంలతోపాటు పలువురు కార్యకర్తలు సైతం సైకిలెక్కారు. 

మంగళగిరి పట్టణంలో సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి తన అనుచరులు అభిమానులతో భారీ ర్యాలీగా ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  

రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించినట్లు తెలిపారు.  

తాను తెలుగుదేశంలో చేరే అంశంపై గతంలో సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి షరతులు లేకుండానే చేరినట్లు తెలిపారు. అయితే సీనియర్ నాయకురాలైన తనకు చంద్రబాబు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారని కాండ్రు కమల స్పష్టం చేశారు. 

కమల తెలుగేదశం పార్టీలో చేరడంతో మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కమల రాకతో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో మరింత బలోపేతం చెందుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.